వైద్యంలో హైదరాబాద్‌కు ప్రాముఖ్యం

 హైదరాబాద్‌కు ఎంతో ప్రాముఖ్యం పెరిగిందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ఇన్నోవేటివ్ మెడికల్ సైన్సెస్, బయోమెడికల్ రంగం పురోగతిలో తెలంగాణ ముందంజలో ఉన్నదని ప్రశంసించారు. క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యంగా ఇంటర్నేషనల్ యూనియన్ అగైనెస్ట్ ట్యూబర్‌కులోసిస్ లంగ్ డిసీజెస్ (ఐయూఏటీబీఎల్‌డీ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నాలుగు రోజులపాటు జరుగనున్న 50వ అంతర్జాతీయ సదస్సును బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాయు కాలుష్యం నియంత్రణపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రత్యామ్నాయ చర్యలు హర్షణీయమన్నారు. భారత్‌లో 2025 వరకు టీబీ నిర్మూలన లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, ఇందుకోసం ప్రైవేటు రంగంతోపాటు సమాజం కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు.


2018లో ప్రపంచవ్యాప్తంగా నమోదైన మరణాల్లో టీబీ పదోస్థానంలో ఉన్నదని చెప్పారు. శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గుతుండటమే దీనికి కారణమన్నారు. రివైజ్డ్ నేషనల్ టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్ (ఆర్‌ఎస్‌టీసీపీ) కార్యక్రమం ద్వారా భారత్‌లో టీబీ వ్యాధిగ్రస్తుల శాతం 1.7 తగ్గిందని, ఇది మరింత తగ్గాల్సిన అవసరం ఉందన్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ టీబీ కారణంగా దేశవ్యాప్తంగా ఏటా 3.5 లక్షల మంది విద్యార్థులు డ్రాపౌట్ అవుతున్నారన్నారు. టొబాకో ఫ్రీ సొసైటీని ఏర్పాటు చేయడంలో అన్నివర్గాల వారు కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో కేంద్ర వైద్యఆరోగ్యశాఖమంత్రి అశ్విన్‌కుమార్ చౌబే, రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్, ఐయూఏటీబీఎల్‌డీ అధ్యక్షుడు జెర్మియా, ఉపాధ్యక్షుడు లూయిస్ కాస్ట్రో, తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్, అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, 130 దేశాలకు చెందిన 400 మంది వైద్యనిపుణులు, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వైద్యులు పాల్గొన్నారు.